టిడిపి, వైసీపీ ప్రభుత్వాల అసమర్థ పాలనలో
ఆంధ్ర రాష్ట్రం అధోగతిపాలైందని భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షులు తోట
చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం రాధ రంగా రాయల్ ఆర్గనైజేషన్
రాష్ట్ర అధ్యక్షులు గాదె బాలాజీ ఆధ్వర్యంలో విశాఖ, పెందుర్తి నియోజక
వర్గాలకు చెందిన టిడిపి, వైసీపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు తోట
సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ముస్లిం హక్కుల పోరాట
సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా
తోట మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి పేద
ప్రజల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు
కేసిఆర్ తెలంగాణాను చేస్తోన్న అభివృద్ధికి ఆకర్షితులై ఏపీలోని టిడిపి, వైసీపీ
పార్టీలకు చెందిన పలువురు నేతలు గులాబీ కండువా కప్పుకొంటున్నారని
స్పష్టం చేశారు. ఆంధ్రాలో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పేందుకు ప్రజలు
సిద్ధంగా ఉన్నారన్నారు. రఫీ మాట్లాడుతూ వైకాపా అధికారం చేపట్టిన నాటి
నుండి పేద ముస్లిం మైనార్టీ కుటుంబాలు సంక్షేమ పధకాలు సక్రమంగా
అందడం లేదన్నారు. నిబంధనల పేరుతో షాదీతోఫాకు తూట్లు పొడుస్తూ
|సిఎం జగన్ ముస్లింలను వంచిస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ తీర్థం
పుచ్చుకున్న వారిలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ విశాఖ జిల్లా మాజీ
అధ్యక్షులు కే. విజయ్‌కుమార్, పెందుర్తి నుండి ఎస్.శ్రీను, కే.ఎస్. ఈ కుమార్,
బొడ్డేడ అనంత వెంకటవేణు, అక్కయ్యపాలెం నుండి బాలాజీ గణేశ్, తెనాలి
నుండి బాష తదితరులున్నారు.