garena free fire apk download

A Man with Mission

A Man with Mission

రాజకీయ పదవుల్లో ఉన్నవారు ఎన్నాళ్లుంటారో ఎవరికీ తెలియదు. కానీ ప్రభుత్వ పాలన నిరంతరాయంగా కొనసాగాల్సిందే. అందుకు పూచీ పడాల్సింది మాత్రం సివిల్ సర్వీసెస్ అధికారులే. అందులోనూ పైస్థాయిలోని ఐఏఎస్‌ లు ఎంతో కీలకం. అధికారంలో ఉన్న నేతలకు ‘అయ్యా ఎస్‌’ అనకుండా నిజాయితీగా, నిజమైన, నిఖార్సయిన ఐఏఎస్‌ లుగా పనిచేస్తే.. దేశాభ్యున్నతికి ఢోకా ఉండదు. అలాంటి అరుదైన ఉన్నతాధికారుల్లో తోట చంద్రశేఖర్ ఒకరు. ఉన్నత పదవిలో కొనసాగడమే కాకుండా ఉన్నత ఆశయాలు కలిగి, ఆదర్శవంతమైన ఏఐఎస్ అధికారి ఎలా ఉండాలో ఒక ఉదాహరణగా నిలిచారు తోట చంద్రశేఖర్‌. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత్‌ రాష్ట్ర సమితికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తోట చంద్రశేఖర్ గతంలో మహారాష్ట్రలో ఓ సంచలనం. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రగతి పరుగుల వెనక ఆయన కీలక పాత్ర పోషించారు. మాఫియాల తాట తీసి, వాళ్ల కొమ్ము కాసే రాజకీయ నాయకుల ఆట కట్టించారు. బడా బిల్డర్ల లాబీల వెన్నులో వణుకు పుట్టించారు. ఎన్నో శ్రమలకు ఓర్చి ఆయా నగరాల అభివృద్ధికి తోట చంద్రశేఖర్‌ బంగారు బాటలు వేశారు. అనేక ఒత్తిళ్లను తట్టుకుని, ఎవరికీ భయపడకుండా 21 ఏళ్ల పాటు తనదైన శైలిలో అనితర సాధ్యంగా అధికార విధులు నిర్వహించిన తోట చంద్రశేఖర్‌ జనసామాన్యం దృష్టలో ఒక రియల్ హీరో.

ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లాలో జన్మించిన డాక్టర్ తోట చంద్రశేఖర్‌ ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చేశారు. అర్బన్ ఎకాలజీ విభాగంలో పరిశోధన చేసి, ముంబై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. 1987లో ఐఏఎస్‌ కు ఎంపికైన తోట చంద్రశేఖర్‌ మహారాష్ట్రలో పలు కీలక పదవులు నిర్వహించారు. 2007 ఆగస్టు వరకు ఆయన ముంబై మెట్రోపాలిటన్ రీజన్‌ డెవలప్ మెంట్ అథారిటీ ఎంఎంఆర్‌ డీఏలో మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ గా వ్యవహరించారు.

అంతకు ముందు 2002 అక్టోబర్‌ నుండి 2005 జూన్ వరకు ఎంఎంఆర్‌ డీఏ అదనపు మెట్రోపాలిటన్ కమిషనర్‌ నూ, ముంబై అర్బన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఎంఎంఆర్‌ డీఏలో వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో తోట చంద్రశేఖర్‌ ముంబై మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల వల్ల నిరాశ్రయులైన పేదల కోసం కేవలం 18 నెలల రికార్డు సమయంలో 50 వేలకు పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. మహారాష్ట్రలో పేదల పక్షపాతిగా ఆయనకు ఉన్న పేరు మరే ఇతర నాయకుడికి కూడా లేదంటే అతిశయోక్తి కాదు.

రెండు వేల సంవత్సరం నుండి 2002 వరకు తోట చంద్రశేఖర్‌ నాగ్‌ పూర్ మున్సిపల్ కమిషనర్‌ గా పనిచేశారు. ఇప్పుడు స్వచ్ఛ్‌ భారత్ పేరుతో సాగుతున్న పారిశుధ్యం ఉద్యమాన్ని ఆయన ఆనాడే నాగ్‌ పూర్‌ లో ప్రారంభించి, విజయం సాధించారు. మహారాష్ట్రలోని నాగ్‌ పూర్ ను క్లీన్ సిటీగా నిలిపారు. అందుకు గాను తోట చంద్రశేఖర్‌ ను పలు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.
అంతకు ముందు 1997 మే నెల నుండి రెండు వేల మే నెల వరకు తోట చంద్రశేఖర్‌ థానే మున్సిపల్‌ కార్పొరేషన్ కమిషనర్‌ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. మురికివాడలతో, అక్రమ నిర్మాణాలతో, చెత్తకుప్పలతో పరమ అస్తవ్యస్థంగా ఉన్న థానే రూపురేఖలను తోట చంద్రశేఖర్‌ కేవలం మూడేళ్లలోనే మార్చేశారు. పరిశుభ్రమైన సుందర నగరంగా దాన్ని తీర్చిదిద్దారు. అందుకుగాను ఆయన సాహసోపేతంగా 20 వేలకు పైగా అక్రమ నిర్మాణాలను తొలగించారు. థానే అభివృద్ధి కోసం ఆయన ఏకంగా 20 ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా అమలు చేశారు. హండ్రెడ్‌ ఎంఎల్‌ డీ వాటర్ సప్లై స్కీమ్‌ ప్రారంభించి, నగరంలో నీటి కొరతను తీర్చారు. తోట చంద్రశేఖర్ అనన్య కృషి వల్ల థానేకు కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో రెండు వేల సంవత్సరంలో క్లీన్‌ సిటీ అవార్డు ప్రకటించింది. అంతలో థానే నుంచి తోట చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. థానే ప్రజలు ఆయనను బదిలీ చేయడాన్ని నిరసించారు. తోట చంద్రశేఖర్‌ బదిలీని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చారు. అది మామూలు నిరసన కాదు. మూడు రోజుల పాటు థానే నగరం మొత్తం బంద్‌ పాటించిందంటే.. ఆయన ఒక అధికారిగా ప్రజల మనిషిగా జనసామాన్యంతో ఎంతగా మమేకం అయ్యారో తెలుస్తుంది. దటీజ్ తోట చంద్రశేఖర్.

థానే అభివృద్ధికి కృషి చేసినందుకు గాను తోట చంద్రశేఖర్ 2001లో ఎకనమిక్‌ టైమ్స్‌ లీడర్‌ షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. థానేలో ఆయన సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా 1998లో ఒకేషనల్ ఎక్స్‌ లెన్స్‌ అవార్డు, 1998లో మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు అందుకున్నారు. అంతేకాదు.. 1997- 2000 మధ్య కాలంలో థానే నగరాభివృద్ధి కోసం చేసిన అనితర సాధ్యమైన కృషికి గాను ఆలిండియా మేనేజ్‌ మెంట్ అసోసియేషన్‌ రెండు వేల సంవత్సరంలో తోట చంద్రశేఖర్‌ కు ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సర్వీస్‌ ఎక్స్‌ లెన్స్ అవార్డు ప్రకటించి, గౌరవించింది.
తోట చంద్రశేఖర్ తొలుత 1995- 97 మధ్య మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కలెక్టర్‌ గా సేవలందించారు. ఆ తర్వాత కళ్యాణ్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ కమిషనర్‌ గా నగర పాలనలో అనుభవం గడించారు. థానే, నాగ్‌ పూర్ నగరాల అభివృద్ధి కోసం తోట చంద్రశేఖర్‌ చేసిన అసమాన కృషికి గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీసెస్ అవార్డు సైతం ఆయనను వరించింది. 2008 ఏప్రిల్‌ లో తోట చంద్రశేఖర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రధాన మంత్రి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఇది తోట చంద్రశేఖర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. నాగ్‌ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనా వ్యవహారాల్లో జవాబుదారీతనం పెంచినందుకు గాను తోట చంద్రశేఖర్‌ కు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రాజీవ్‌ గాంధీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌ అవార్డు ప్రకటించింది.

ఎంఎంఆర్‌ డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ గా ఉన్నప్పుడు తోట చంద్రశేఖర్‌ ముంబై అర్బన్‌ ట్రాన్స్ పోర్ట్‌ ప్రాజెక్టు, ముంబై అర్బన్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్షర్ ప్రాజెక్టు, ముంబై మెట్రో ప్రాజెక్టు వంటి పలు కీలక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, అమలు చేశారు. మనం ఇప్పుడు ఘనంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ వంటి అధునాతనమైన ప్రాజెక్టును తోట చంద్రశేఖర్‌ చాలా ఏళ్ల క్రిందటే అమలు చేసి చూపించారు. అనేక ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థలను మెరుగుపరిచారు. ఇదంతా తోట చంద్రశేఖర్ దూరదృష్టికి తార్కాణం.
ఇన్ని వరుస విజయాలు సాధించిన తోట చంద్రశేఖర్‌ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవలు అందించే సంకల్పంతో.. సదాశయంతో 2008 సెప్టెంబర్ లో ఐఏఎస్‌ పదవిని స్వచ్ఛందంగా వదులుకున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి, అప్పటి నుంచి ప్రజాజీవితంలో ఉన్నారు. చక్కని వర్చస్సుతో అందరినీ ఇట్టే ఆకట్టుకునే తోట చంద్రశేఖర్ స్ఫురద్రూపి, సౌమ్యుడు, మృదుభాషి. మంచి వక్త. ఎంతో విషయ పరిజ్ఞానంతో, లోతైన అధ్యయనంతో గణాంకాల ఆధారాలతో చంద్రశేఖర్ ప్రసంగాలు సాగుతాయి. ఉన్నత విద్యావంతుడు. ప్రతిభావంతుడు. మచ్చలేని వాడు. అనుభవజ్ఞుడు. మునుముందుకు దూసుకుపోయే.నాయకుడు. సాహసి, ప్రజల హితం కోరేవాడు. ప్రజల మనిషి. పేదల పక్షపాతి అయిన తోట చంద్రశేఖర్‌ ఒక్క మాటలో చెప్పాలంటే.. అతడే ఒక సైన్యం. ఒక తెలుగుతేజం. ఆ తెలుగుతేజం వెలుగులు విరజిమ్మి, వెల్లివిరియాలన్నదే రాష్ట్ర హితైషుల ఆకాంక్ష. తోట చంద్రశేఖర్‌ సేవలు వినియోగించుకోగలిగితే.. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు కూడా ముంబై, థానే, నాగ్‌ పూర్‌ నగరాల మాదిరిగా సరికొత్త రూపు దిద్దుకుంటాయి. నిస్సందేహంగా పురోగతి సాధిస్తాయి. నిత్యం సతమతం చేసే ప్రజా సమస్యలెన్నో పరిష్కారం అవుతాయి. సుపరిపాలన సుసాధ్యం అవుతుంది. ఆ మంచి రోజు మరెంతో దూరం లేదు.