ఎపి ప్రజలు తెలంగాణ మోడల్ ను కాంక్షిస్తున్నారని బిఆర్ఎస్ ఎపి చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణా తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎపి లో వనరులున్నా అభివృద్ధి సున్నా అని విమర్శించారు. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం గుంటూరు నగరం లోని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తోట చంద్రశేఖర్ భరతమాత చిత్రపటానికి పూల మాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నుండి అమలు కావాల్సిన విభజన హామీల సాధనలో గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని చెందాయని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ ఎపి ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతూ రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడుస్తూ అభివృద్ధి నిరోధకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి, వైసిపి పార్టీలు బిజెపితో అంటకాగుతూ మోడీ వద్ద సాగిల పడుతున్నాయని ఆరోపించారు. దేశంలో బిజెపిని ఢీ కొట్టే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ బిజెపి రాజకీయ పబ్బం గడుపుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసే కుట్ర బిజెపి చేస్తోందని ధ్వజమెత్తారు