రాజకీయ పదవుల్లో ఉన్నవారు ఎన్నాళ్లుంటారో ఎవరికీ తెలియదు. కానీ ప్రభుత్వ పాలన నిరంతరాయంగా కొనసాగాల్సిందే. అందుకు పూచీ పడాల్సింది మాత్రం సివిల్ సర్వీసెస్ అధికారులే. అందులోనూ పైస్థాయిలోని ఐఏఎస్ లు ఎంతో కీలకం. అధికారంలో ఉన్న నేతలకు ‘అయ్యా ఎస్’ అనకుండా నిజాయితీగా, నిజమైన, నిఖార్సయిన ఐఏఎస్ లుగా పనిచేస్తే.. దేశాభ్యున్నతికి ఢోకా ఉండదు. అలాంటి అరుదైన ఉన్నతాధికారుల్లో తోట చంద్రశేఖర్ ఒకరు. ఉన్నత పదవిలో కొనసాగడమే కాకుండా ఉన్నత ఆశయాలు కలిగి, ఆదర్శవంతమైన ఏఐఎస్ అధికారి ఎలా ఉండాలో ఒక ఉదాహరణగా నిలిచారు తోట చంద్రశేఖర్. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తోట చంద్రశేఖర్ గతంలో మహారాష్ట్రలో ఓ సంచలనం. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రగతి పరుగుల వెనక ఆయన కీలక పాత్ర పోషించారు. మాఫియాల తాట తీసి, వాళ్ల కొమ్ము కాసే రాజకీయ నాయకుల ఆట కట్టించారు. బడా బిల్డర్ల లాబీల వెన్నులో వణుకు పుట్టించారు. ఎన్నో శ్రమలకు ఓర్చి ఆయా నగరాల అభివృద్ధికి తోట చంద్రశేఖర్ బంగారు బాటలు వేశారు. అనేక ఒత్తిళ్లను తట్టుకుని, ఎవరికీ భయపడకుండా 21 ఏళ్ల పాటు తనదైన శైలిలో అనితర సాధ్యంగా అధికార విధులు నిర్వహించిన తోట చంద్రశేఖర్ జనసామాన్యం దృష్టలో ఒక రియల్ హీరో.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జన్మించిన డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చేశారు. అర్బన్ ఎకాలజీ విభాగంలో పరిశోధన చేసి, ముంబై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. 1987లో ఐఏఎస్ కు ఎంపికైన తోట చంద్రశేఖర్ మహారాష్ట్రలో పలు కీలక పదవులు నిర్వహించారు. 2007 ఆగస్టు వరకు ఆయన ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్ మెంట్ అథారిటీ ఎంఎంఆర్ డీఏలో మెట్రోపాలిటన్ కమిషనర్ గా వ్యవహరించారు.
అంతకు ముందు 2002 అక్టోబర్ నుండి 2005 జూన్ వరకు ఎంఎంఆర్ డీఏ అదనపు మెట్రోపాలిటన్ కమిషనర్ నూ, ముంబై అర్బన్ ప్రాజెక్టు డైరెక్టర్గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఎంఎంఆర్ డీఏలో వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో తోట చంద్రశేఖర్ ముంబై మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల వల్ల నిరాశ్రయులైన పేదల కోసం కేవలం 18 నెలల రికార్డు సమయంలో 50 వేలకు పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. మహారాష్ట్రలో పేదల పక్షపాతిగా ఆయనకు ఉన్న పేరు మరే ఇతర నాయకుడికి కూడా లేదంటే అతిశయోక్తి కాదు.
రెండు వేల సంవత్సరం నుండి 2002 వరకు తోట చంద్రశేఖర్ నాగ్ పూర్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు. ఇప్పుడు స్వచ్ఛ్ భారత్ పేరుతో సాగుతున్న పారిశుధ్యం ఉద్యమాన్ని ఆయన ఆనాడే నాగ్ పూర్ లో ప్రారంభించి, విజయం సాధించారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ ను క్లీన్ సిటీగా నిలిపారు. అందుకు గాను తోట చంద్రశేఖర్ ను పలు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.